Saturday, December 29, 2007

ముసురు

ఎప్పటికయినా

తెరపి ఉంటుందంటావా -

ఉంటుందనుకుంటా,

తెరపివ్వక పోతే

ముసురుతో బతకటమెట్టాగో

తెలుసుకుంటావు

ఏదో కదులుతుంది

ఏదో మెదులుతుంది

తెగి, సగం మాత్రమే బయటికొస్తుంది

దొరికీ, దొరకని సగం ముక్కతో

దేన్ని దొరక బుచ్చుకుంటావు

అదంతే, అణగారిన బతుకునిండా

అనూహ్య మయిన అవమానాలు,

భరిస్తావు, భరించటం కూడా

ఒక సుగుణమని భరిస్తావు

వేరే మార్గం లేదు,

కడుపుచించుకుంటే కాళ్లమీద పడుతుంది

రేయి క్రమక్రమంగా చచ్చిపోతుంది.

పొద్దున్నే లేచి తలుపుతీస్తే

చచ్చిపోయిన పామునెవరో

ఇంటిముందు పారేసిపోయారు

చనిపోయిన పాము అందంగా ఉండదు

నెరవేరని కోరికలా కుళ్లు వాసనేస్తుంది

ఎన్ని ఊహల తదనంతర మీ మరణం

దొరువులో

చెంబుతో నీళ్లు తోడి కడవనింపుతావు

కడవనెత్తి నెత్తిమీద పెట్టే ఒక తల్లికోసం

ఎదురు చూస్తావు

చెమటకి తడిసిన బట్టలు దణ్నెం మీద

గాలికి ఊగుతూ ఉంటాయి

ఎప్పుడూ అవి ఎండవు

వంటిమీదున్నా, దణ్నెం మీదున్నా

ఆరని చెమట ధరిత్రి రక్తమట.

మార్గం లేని మార్గాల గుండా

మరణిస్తూ ప్రయాణిస్తుంటావు

ఏదీ దొరకదు

అన్వేషణ కర్థం అన్వేషణగానే మిగిలిపోతుంది

శూన్యం నుంచి ఒక ముక్క తెగి

నీ ముందు బడుతుంది.

రోడ్డంతా నిస్తేజంగా పడి ఉంటుంది

ఎండ మెరపులేవో మిలమిలా మెరుస్తాయి

చలిగాలి ఆగదు, చనిపోయిన పామునీ

రోడ్డునీ స్పృశిస్తూ వెడుతుంది.

తపోభంగమౌతుంది

సాకారం పొందని జీమితమేదో

కొనవూపిరితో కొట్టుకు లాడుతుంది

పురాణ గాధల్నించి

నాగులు తుంటలు తెచ్చి చితిపేరుస్తావు

సగం కాలిన శరీరాలు కాశీలో

గంగానది ఒడ్డున దొర్లుతుంటాయి

పుణ్యపాపాలెక్కడో అర్థంకాక

తనువునిండా పొర్లుతున్న పాములతో

బతకటానికి ప్రయత్నిస్తావు

ఎవరూ ఏమీ అనలేని స్థితి

ఎవరో కథ చెబుతుంటారు

మరెవరో ఊఁ కొడుతుంటారు

వినేవాళ్లు అవసరమన్న జ్ఞానం

పూర్తిగా నశిస్తుంది

వీధి దీపం కింద ప్రేయసీ ప్రియులిద్దరూ

విహ్వల దృక్కులతో

చంద్రుడు చేతికందినట్టు అంది

అందకుండా పోతాడు

స్థితిజం గతితప్పుతుంది

తన్నుతాను మలుచుకునే కార్యక్రమమేదో

మొదలయినట్టు కనబడుతుంది

దుఃఖితులందరూ రూపాంతరం చెందటం

నే చూస్తున్నా

అకస్మాత్తుగా ఇప్పుడు

ఒకానొక కూడలిలో గాంధీ విగ్రహం

ఆశ్చర్యం గొలుపుతుంది

దేనికో సంకేతంగా నిలబడుతుంది.

భవిష్యత్తులో బాహువులు

యింత దూరం సాగుతాయా?

వద్దనుకున్న దేదో యిప్పుడవసరమౌతుందా

ఒకదాని సారం ఒక జాతికి వంటబట్టడానికి

చాలా కాలం పడుతుంది.

కుదుపుల కుదుపుల అగమ్యగమ్యాల తర్వాత

ఒక నిలువుట్టమేదో

ప్రతి మనిషి ముందూ నిలబడుతుంది

అంతరంగాల అనంతశోధనగా అది కనబడుతుంది

తెరపి లేని దేదీ ఉండదు

అంతం లేని దేదీ ఉండదు

నిన్ను నువ్వు పున:ప్రతిష్టించు

కోవటమెలాగో తెలుసుకోవాలి

(from: www.pranahitha.org)

No comments: